| Mana Jilla Sahityam |
మన జిల్లా సాహిత్యంసాహిత్యంలో మన జిల్లాకి ప్రత్యేక స్థానం ఉంది, అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య, సి. నారాయణరెడ్డి, పి.వి. నరసింహారావులాంటి ప్రముఖులు పుట్టిన గడ్డ ఇది. మన జిల్లా రచయితల రచనలకు తెలుగు సాహిత్య జగత్తులో ప్రత్యేక గుర్తింపు ఉంది, గతంలోని రచనలు పూర్తి తెలంగాణా యాసతో విమర్శకుల మన్ననలను అందుకుంటే, సాహిత్య ప్రపంచానికి విశ్వంభర...సినారే కలం నుండి జీవంపోసుకుని జ్ఞానపీఠం ఎక్కింది. వంగరలో జన్మించి సకళ బాషా ప్రజ్ఞ్యాశీలి, దేశ ప్రధాని భాద్యతలు నిర్వహించిన మన పి.వి. నరసింహా రావుగారి "ది ఇన్‌సైడర్" దేశవ్యాప్తంగా మంచిపేరు సంపాదించుకుంది. Source: http://soyi.discover-telangana.org/ 1. అల్లం రాజయ్య కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు మంచిర్యాలలో నివాసముంటున్నారు. వీరి కథలలో కుల, మత, ప్రాంత, భాషా, స్రీ-పురుష వివక్ష చిత్రణ చాలా జరిగింది. సామాజిక వాస్తవికతను యధాతథంగా చిత్రించాడు. వీరి కథలు ఇటీవలి తెలంగాణా కథకు దిశా నిర్దేశం చేశాయి. భూమి లాంటి కథా సంపుటాలను వెలువరించారు. వీరి కథా సాహిత్యం తెలుగు కథ మెడలో వేసిన మణిహారం......మరిన్నివివరాలు 2. అందె వెంకటరాజం అష్టావధానిగా పేరు గాంచిన వీరు కరీంనగర్ జిల్లా కోరుట్ల నివాసి. దాదాపు డెబ్భయి కథలు రాశారు. విచిత్ర గాధలు అనే సంపుటిని వెలువరించారు. అర్థరాత్రి సుప్రభాతం, పసివాని మూడో పెండ్లి, మైసమ్మ భయం, అంగడి వింతలు, విచిత్రమైన భక్తురాలు మొదలైన కథలు వీరి లోక పరిశీలనా శక్తికి నిదర్శనాలు. 3. అల్లాడి శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కథలాపూర్‌మండలంలోని భూషణరావు పేటకు చెందిన వీరి కథల్లో సున్నితమైన భావుకత్వం గోచరిస్తుంది. మానవ సంబంధాల పట్ల గల వీరి తపన కథలుగా మారింది. ఎడారి పూలు, మబ్బులు తొలిగిన వేళ లాంటి కథలు పాఠకుల ప్రశంసలు పొందాయి. బాటఎరిగిన పాట అనే కథ కథన శక్తికి నిదర్శనం. 4. అకిరెడ్డి శ్రీనివాసరావు కరీంనగర్ జిల్లాకు చెందిన వీరి నిరసన అనే కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. 5. అన్నవరం దేవేందర్ కరీంనగర్‌కు చెందిన వీరు కొన్ని కథలు రాశారు. చింత చచ్చినా, జైలు బడి, నేమ్ ప్లేట్ లాంటి కథలు రాశారు. కథల్లో వస్తు వైవిధ్యం ఉంది 6. ఆడెపు లక్ష్మీపతి కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. చైతన్య స్రవంతి టెక్నిక్‌తో కథలు రాసిన రచయిత లక్ష్మీపతి. జీవన్మృతుడు అనే కథను చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాశారు. ఇతను వెలువరించిన నాలుగు దృశ్యాలు కథా సంపుటిలో వస్తు పరంగానూ, శిల్ప పరంగానూ వైవిధ్య భరితమైన కథలున్నాయి. 7. ఉమ్మెంతల వెంకట రెడ్డి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. పోచమ్మ అనే కథ బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది. 8. ఉలి పూర్తిపేరు ఉప్పుల లింగయ్య. కరీంనగర్‌కు చెందిన వీరు అనేక కథలు రాశారు. వీరి కథల్లో రాతితేమ అనే కథ వీరి శిల్ప నైపుణ్యాన్ని పట్టిస్తుంది. దోపిడి, పరీక్ష, రాబందు, పాము లాంటి అనేక కథలు రాశారు. 9. ఎం. విజయమోహన్ రెడ్డి కరీంనగర్‌లో పేరున్న వైద్యులు. ఇది కళ్యాణ సంస్కృతా!, దొరకని భాగ్యం మొదలగు కథలు రాశారు. వీరి కథలన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 10. యం. శరత్ కుమార్ వీరు కరీంనగర్ వాస్తవ్యులు. వీరు రాసిన రేపటి ఉదయం అనే కథ బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది. 11. ఎస్. హర్షవర్ధన్ కరీంనగర్ నివాసి. కథ రాయాలనుంది, వరకట్న నిషేదం, మహాసభ, నిరుద్యోగి లేఖ లాంటి కథలు రాశారు. ఎదుగుతున్న కథకుడు. 12. ఏ. ఆంజనేయ ప్రసాద్ కరీంనగర్‌కు చెందిన వీరు చాలా తక్కువ కథలు రాశారు. తనదాకా వస్తే అనే కథ చిన్నారి కథానికలు బాల కథా సంకలనంలో ప్రచురితమైంది. 13. ఎనుగంటి వేణుగోపాల్ కరీంనగర్ చిల్లాకు చెందిన మంచి కథకుడు. రుణం అనేది మంచి కథ. వీరి కథల్లో తెలంగాణా పలుకుబడులు జాలువారుతుంటాయి. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వీరు ఎదుగుతున్న కథకుడు. 14. కలకోట కిషన్ రావు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన మంచి కథకులు. పేదవాడి కన్ను అనే కథ దళిత కథగా చెప్పవచ్చు. కథల్లోని పల్లె వాతావరణం, సామెతలు, కథలకు బలాన్నిచ్చాయి. 15. కటుకోజ్వల మనోహరాచారి కరీంనగర్ జిల్లాకు చెందిన యువ కథకుడు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిర పడి సాహితీ సేవ చేస్తున్నారు. కథలన్నీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సమస్యా పూరణం, వర్షంలో వనకన్య లాంటి కథలు వీరి కథన శక్తికి ఉదాహరణలుగా నిలుస్తాయి. వీరి కలం ఎక్కువగా మానవ జీవితంలోని సుఖ సంతోషాలను పట్టి చూపుతుంది. 16.. కాలువ మల్లయ్య కరీంనగర్ వాస్తవ్యులు. దాదాపు ఏడు వందల వరకు కథలు రాసిన వీరు స్పృశించని సమస్య లేదు. కాలువ మల్లయ్య కథలు, మా కథలు, అవ్వతోడు గిది తెలంగాణ, రాజు కోడి లాంటి అనేక సంపుటాలు వెలువరించారు. తెలంగాణా ప్రాంతోచిత భాష వీరి కథలకు జీవశక్తిని ఇచ్చింది. 17. కారెంపూడి మార్కండేయ నిరసన అనే వీరి కథ శ్వేతరాత్రులు కథా సంకలనంలో ప్రచురితమైంది. కరీంనగర్‌కు చెందిన వీరు బాల గెరిల్లా, మంకీ లాంటి మరిన్ని కథలు రాశారు. 18.. కె. వి. నరేందర్ పాఠకులను ఆకట్టుకునే విధంగా కథ రాయగలిగే వీరు కరీంనగర్ వాసి. సింగిల్ కాన్సెప్ట్‌తో కథలు రాసి ప్రచురించడం వీరి హాబి. అమ్మ, యుద్ధం, బురదలో జాబిల్లి, ఊరు మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. వస్తు వైవిధ్యంలోనూ, శిల్పంలోనూ, తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నారు.......మరిన్నివివరాలు 19. కొక్కుల భాస్కర్ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన మంచి కథకులు. తెగిన పోగు వీరి ప్రసిద్ధి చెందిన కథ. పద్మ పీఠం అనే పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. వీరి అనేక కథలు అనుభవసారాలు. 20. కొక్కుల పద్మావతి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన ఈమె కథల్ని అనువదించారు. దాదాపు పది దాకా స్వతంత్ర కథలు రాశారు. పాల మీగడ, ప్రశంస కథలు ఎక్కువ ప్రసిద్ధి చెందిన కథలు. 21. గట్టు నారాయణ కరీంనగర్ జిల్లా మంథని వాస్తవ్యులైన వీరు ప్రముఖ పారిశ్రామిక వేత్త. ఆధ్యాత్మిక నేపథ్యంలో వీరు అనేక కథలు ఆంగ్లంలో రచించారు. సేతువు, సముద్రము అనేవి తెలుగు కథలు. ప్రతి కథ పారమార్థిక చింతనను కలిగించి మనిషిని సద్వర్తనునిగా చేస్తుంది. 22. గులాబీల మల్లారెడ్డి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన వీరు వకీలు. జర్నలిస్టు అనేది వీరి కథా సంపుటి. ఈ సంపుటి వీరి స్పందనలకు, సామాజిక స్పృహకు తార్కాణంగా నిలుస్తుంది. 23. గర్శకుర్తి శ్యామల కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. ఇంటింటికో దీపావళి, స్ఫూర్తి, పెళ్ళి, వెతల నడుమ చదువు లాంటి అనేక కథలు వీరు రాశారు. విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు. 24. గజానన్ థామన్ వీరు కరీంనగర్ జిల్లా మంథని వాస్తవ్యులు. వీరు అనేక కథల్ని అనువాదం చేశారు. 25. గుండెడప్పు కనకయ్య కరీంనగర్‌కు చెందిన వీరు మేమిట్లుండం కథా సంకలనంతో కథా రంగాన కాలు మోపారు. దళిత స్పృహతో దళిత కథా సాహిత్యాన్ని సృజించాడు. కథలు హరిజనుల జీవన సందర్భాలను, వేదనలను, వేడుకలను, ఊహలను, ఉద్వేగాలను, సర్దుబాట్లను, తిరుగుబాట్లను ప్రతిఫలించాయి. 26. గూడూరి అమరావతి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన ఈమె దాదాపు పది కథలు రాశారు. గూడు-నిట్టాడు అనే కథ ప్రసిద్ధి చెందింది. 27. గూడూరి సీతారాం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లకు చెందినవారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దాదాపు ఎనభై వరకు కథలు రాశారు. గూడూరి సీతారాం కథలు పేరున కథా సంపుటి వెలువరించారు. వీరి చాలా కథలు అందుబాటులో లేవు. నారిగాని బతుకు, రాజమ్మ రాజీర్కం, లచ్చి లాంటి కథలు యదార్థ జీవన దర్పణాలు. 28. గోపు లింగారెడ్డి కరీంనగర్‌కు చెందిన వీరు సాహిత్య కార్యకర్త. చింతచెట్టు, (అ)ధర్మవడ్డీ, వన్నెలరాజు మీసాల కథ లాంటి కథల్ని రాశారు. 29. గౌతమ్ నరసింహ మూర్తి వీరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. ఇంటర్వ్యూ మొదలగు కథలు రాశారు. నల్లకలువలు కథా సంకలనంలో వీరి కథ ప్రచురితమైంది. 30. చింతల దేవేందర్ వీరు కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తువ్యులు. సుమారు 30 కథల వరకు రాశారు. ఇవన్నీ చిన్న కథల కోవలోకి వస్తాయి. థాంక్యూ మమ్మీ, జ్ఞాపకం, చిత్తశుద్ధి, విష్ణుమాయ, విలువలు లాంటి కథలు వీరి రచనా శైలికి నిదర్శనాలు. నిరలంకార శైలిలో సాగే వీరి కథనం ఆసక్తిని గొలుపుతుంది. 31. చెన్నమనేని రాజేశ్వర్‌రావు కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలంలోని నాగారంలో జన్మించారు. రాజకీయ నాయకునిగా సుప్రసిద్ధుడు. తెలంగాణా సాయుధ పోరాట కాలంలో వీరు జైలులో ఉండగా పిట్ట బతుకు అనే కథ రాశారు. 32. చైతన్య ప్రకాశ్ కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ రేణ కథా సంపుటిని వెలువరించారు. ఇతని కథలకు క్లుప్తత ప్రాణాధారంగా ఉంది. నిమ్నకుల సమస్యల్ని కథలుగా చిత్రించారు. బతుకు రేవు, చంద్రకళ, అమీన, రేణ లాంటి కథలు వీరి కథా కౌశలానికి నిదర్శనాలు. లోతైన అవగాహన, సామాజిక సమస్యల పట్లగల పరిశీలన, వీరి కథల్లో తొంగి చూస్తాయి. 33. చొప్పకట్ల చంద్రమౌళి కరీంనగర్ జిల్లా వేములవాడవాస్తవ్యులు. భయం, తాటాకు మంటలు, ఇడ్పుగాయిదం లాంటి కథలు వీరి శైలిని పట్టిస్తాయి. 34. జయధీర్ తిరుమల రావు కరీంనగర్ జిలాలో జన్మించిన వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీరు దాదాపు ఇరవై కథలు రాశారు. పరిశోధకులుగా ప్రసిద్ధులు. వీరి కథలు కొత్త కోణాల్ని ఆవిష్కరించాయి. చలం చెప్పని కథ వీరి నవ్య ధోరణికి ప్రతీక. పురివిప్పిన కర్తవ్యం కథలో, వీరి పరిశీలనాశక్తిని, శిల్ప చాతుర్యాన్ని విడమరుస్తుంది. 35. జి. సురమౌళి కరీంనగర్ జిల్లా విలాసాగర్‌లో జన్మించారు. మధులిమాయె రాసిన విప్లవ సారధి అంబేడ్కర్ అనే పుస్తకాన్ని తెనిగించారు. ఏ విషయాన్నయినా బలంగా చిత్రించగల కథనం వీరి సొంతం. వీరి అంగుడు పొద్దు కథంతా తెలంగాణా మాండలికంతో నడిచింది. 36. జి. రాములు కరీంనగర్‌కు చెందిన వీరు 1948లో పెరటి చెట్టు, పిచ్చి శాయన్న అనే పెద్ద కథలను రాశారు. వీరి ఆత్మఘోష కథ గ్రాంధిక భాషలో ఉంది. సంస్కరణ భావాలను చిత్రించే కథ ఇది. 37. జింబో (మంగారి రాజేందర్) అసలు పేరు మంగారి రాజేందర్. కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యులు. లా వొక్కింతయు లేదు, జింబో కథలు లాంటి కథా సంపుటాలు వెలువరించారు. అన్ని ప్రక్రియల్లో వీరిది అందె వేసిన చేయి. వీరి కథల్లోని ఇతి వృత్తాలు ఎక్కువగా న్యాయపరమైన విషయాల్ని చర్చిస్తాయి. తన జన్మస్థలమైన వేములవాడ ప్రాంత విశిష్టతను తెలుపుతూ కథలు రాస్తున్నారు. 38. జూకంటి జగన్నాథం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాస్తవ్యులు. వైపని అనే కథా సంపుటిని వెలువరించారు. వలస, కళేబరం, దుగోడ, యాతన లాంటి కథలు వీరి కథన శక్తికి నిదర్శనాలు. తెలంగాణాలో జరిగే మార్పులు కథల్లో గోచరిస్తాయి. కవిగా ప్రసిద్ధి కెక్కిన వీరు మంచి కథకులు. 39. డింగరి నరహరి ఆచారి వీరు కరీంనగర్‌కు చెందిన సంస్కృతాంధ్ర పండితులు. సంస్కృతం నుండి తెలుగులోకి కథల్ని అనువాదం చేశారు. కవిసామ్రాట్ మరియు పుత్రస్యాపిగతిర్నాస్తి అనే రెండు తెలుగు కథలు రాశారు. కవిగా, వ్యాసకర్తగా లబ్ద ప్రతిష్టులు. 40. తాడిగిరి పోతరాజు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నివాసి. ఎర్రబుట్ట వీరి పెద్ద కథ. వీరి కథలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని కలిగించాయి. బ్లాక్ అండ్ వైట్ అనే కథ బద్‌లా కథా సంకలనంలో కనబడుతుంది. అనేక కథలు రాసిన వీరు విశ్రాంత ఆంగ్లోపన్యాసకులు. 41. తిరుపతి కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు పిడికిళ్ళు బిగుసుకున్న రాత్రి అనే కథ రాశారు. బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది. 42. తుమ్మేటి రఘోత్తమరెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన కథకులు. తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు పేర వీరి కథల్ని విరసం పుస్తక రూపంలో ప్రచురించింది. సిద్ధాంత బరువుతో నినాదప్రాయంగా, శిల్ప రహితంగా విప్లవకథ ఉంటుందనే అపోహను వీరి కథలు పటాపంచలు చేశాయి. 43. దార్ల రామచంద్రం కరీంనగర్లో నివసిస్తున్న వీరు కిర్రు చెప్పులు కథా సంపుటిని వెలువరించారు. సామాజిక సమస్యలకు, సంఘటనలకు సాహిత్య రూపం ఇవ్వడం ద్వారా రామచంద్రం సామాజిక చైతన్యంగల కథా రచయితగా ఎదిగారు. బాల చంద్రుడు, బాల్యం బతుకు, బతుకు బడి, కిర్రు చెప్పులు కథలు తెలంగాణా బహుజన కులాల సంస్కృతి ప్రతిబింబాలు. 44. నలిమెల భాస్కర్ ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పద్నాలుగు భాషల్లో వీరిది అందెవేసిన చేయి. నూరేళ్ళ పది ఉత్తమ మళయాళ కథలు, అద్దంలో గాంధారి, మంద అనే అనువాద కథా సంకలనాల్ని వెలువరించారు. మంద మరియు నాకూ స్వాతంత్య్రం వచ్చింది అనే రెండు కథలు, స్వతంత్ర కథలు. అనువాదానికి కథల్ని ఎంచుకొనే వీరి ధోరిణి విలక్షణంగా కనిపిస్తుంది. 45. నల్లాల లక్ష్మీరాజం కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన వీరి సంపుటి తిరుగు ప్రయాణం. తిరుగు ప్రయాణం, దొమ్మరి రంగడు, మావూరి ముచ్చట్లు, పునరావృతం లాంటి కథల్లో రచయిత యొక్క దృక్పథం కనిపిస్తుంది. పీడితకుల సంస్కృతి చిత్రణ, తెలంగాణలో వచ్చిన మార్పులు ఇతని కథల్లో కనిపిస్తాయి. 46. నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ జిల్లా హన్మాజిపేటకు చెందిన వీరు వృత్తిరీత్యా గీత కార్మికుడు. పది కథలతో కూడిన పేదోళ్ళ బతుకులు అనే కథా సంపుటిని ప్రచురించారు. సామాజిక సమస్యలకు తన కథల్లో చోటిచ్చి, సమకాలీన జీవితాలను చిత్రించారు. తెలంగాణా ప్రాంతోచిత భాష వీరి కథలకు వన్నె తెచ్చింది. 47. పల్లె సురేష్ బాబు కరీంనగర్ జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన వీరు తమ కథల్లో సామాజిక సమస్యలనే కాక ప్రేమ వ్యవహారాల్ని కూడా చిత్రించారు. మనసు లోగిళ్ళు, గుండెకో సవ్వడి అనే కథల్ని ప్రేమ, శృంగారం సమపాళ్ళలో రంగరించి రాశారు. వీరి కథల్లో సెంటిమెంటు, ప్రేమ పండుతుంది. 48. పంజాల జగన్నాథం కరీంనగర్‌కు చెందిన వీరు మట్టి వాసనలు అనే కథా సంపుటిని వెలువరించారు. కథల్లో సామాజిక సమస్యల పట్ల ఆవేదన ఉంది. తెలంగాణా ప్రాంతోచిత భాష కథల్లో కనబడుతుంది. 49. పాములపర్తి వెంకట నరసింహారావు కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించారు. భారత ప్రధానిగా పనిచేసి పేరుగాంచినారు. వీరి గొల్ల రామవ్వ అనే కథ సాహితీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుంది. విశ్వనాథ వేయిపడగలు నవలను సహస్ర ఫణ్ పేర హిందీలోకి అనువదించినారు. ఆత్మకథాత్మకమైన ఇన్‌సైడర్ అనే నవలను ఇంగ్లీషులో రచించారు.....మరిన్నివివరాలు 50. పి. చంద్ కార్మిక, గిరిజన, రైతాంగ కథలు అనేకం రాసిన పి. చంద్ భూనిర్వాసితులు లాంటి సింగిల్ కాన్సెప్ట్‌తో కథా సంపుటి వెలువరించారు. కరీంనగర్‌కు చెందిన వీరు జులుం అనే కథా సంపుటిని కూడా వెలువరించారు. తెలంగాణాలో చోటు చేసుకున్న ఉద్యమాల పట్ల నిబద్ధత కలిగి అణచివేతకు గురైన వర్గాల పక్షాన నిలిచి కథలు రాశాడు. బొగ్గు గనుల్లో జరుగుతున్న మార్పులను, అన్యాయాలను చిత్రించే కథలను అనేకం రాసాడు. 51. పెద్దింటి అశోక్ కుమార్ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండల వాస్తవ్యులు. ఊటబాయి. వలస బతుకులు, మా ఊరి బాగోతం లాంటి కథా సంపుటాలను వెలువరించారు. అనేక కథలను రాసిన వీరి కలం తెలంగాణా ప్రాంతోచిత భాషకు పట్టం కట్టింది. వీరి కథల్లో సామెతలు, పలుకుబళ్ళు బండ్లకొద్దీ దొర్లుతుంటాయి. తెలంగాణా పల్లె జీవితాలు వీరి కథల్లో చిత్రితమయ్యాయి. 52. బాలవేని రాజేశం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గరగల కొత్తపల్లి గ్రామ నివాసి. కథలంటే మక్కువ ఎక్కువ. నానమ్మకల, మా బడి దొరగడి అనే కథలు ప్రచురితమయ్యాయి. తెలంగాణా మాండలికం వీరి కథలకు శక్తి నిచ్చింది. 53. బి.ఎస్. రాములు కరీంనగర్‌కు చెందిన వీరు కథకుడు, తత్వవేత్త. పాలు, తేనెటీగలు, వేపచెట్టు, మమతలు-మానవ సంబంధాలు, బతుకు పయనం లాంటి అనేక కథా సంపుటాలను వెలువరించారు. ప్రథమ శ్రేణి మేధావిలా నిలబడాలని చెప్పే బి.ఎస్. రాములు తన కథల్లో దృక్ఫథానికి కాక జీవితానికి పెద్దపీట వేశారు.........మరిన్నివివరాలు 54. బి. దామోదర్ రావు వృత్తిరీత్యా ఉపన్యాసకుడైన వీరు కరీంనగర్ జిల్లా నివాసి. ఇతని సింగిడి కథా సంపుటిలోని కథలన్నీ గ్రామాల్లో జరుగుతున్న కుల వివక్షతను, దొరల దౌర్జన్యాన్ని, పన్నుల వసూలు తదితరాలైన కథాంశాలతో ఉన్నాయి. గిరివి అనే కథ తెలంగాణా జన జీవితాల్ని చిత్రించింది. 55. బుర్ర తిరుపతి పెద్దపల్లికి చెందిన జర్నలిస్టు. తక్కువ కథలు రాసినా మంచి కథలు రాసారు. పల్లె అలికిడి, అరుణ మొదలైన కథలు వీరి సామాజిక దృక్ఫథాన్ని పట్టిస్తాయి. 56. బెజ్జారపు వినోద్ కుమార్ కరీంనగర్ జిల్లా కోరుట్ల నివాసి. దాదాపు వంద వరకు కథలు రాశారు. గవ్వల మూట అనే కథా సంపుటిని వెలువరించారు. విడవకుండా కథను చదివించే శైలి వీరిది. చిన్న విషయాలను కూడా కథగా మరల్చగల నేర్పు వీరికుంది. కొమ్మల్లో గాలిపటం, తాతాయ్య వాచీ లాంటి కథలు వీరి కీర్తిని ఇనుమడింప చేసాయి. 57. బెజ్జారపు రవీందర్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంచి కథా రచయిత. చరణం జారిపోయాక, పడగ తెగిన పాము, గోగుపూల పాట, నిత్యగాయాల నది, పోరుతల్లి, ఒంటికాలి శివుడు, వానపాట, జీవన గీతం, పీనుగు లాంటి కథల్ని విశ్లేషిస్తే వస్తు వైవిధ్యం, శిల్ప రహస్యాలు తెలిసివస్తాయి. 58. బోయిన భాస్కర్ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌ప్రాంతానికి చెందిన వీరు పత్రికారంగంలో పనిచేస్తున్నారు. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. యామిని, గడ్డిపువ్వు అనే కథలు కథా పాటవానికి నిదర్శనంగా నిలుస్తాయి. జీవితమే వీరికి రచనా శక్తిని ప్రసాదించింది. 59. మలయ శ్రీ కరీంనగర్ చెందిన మంచి సాహితీ వేత్త. ఐరేని కుండలు అనే కథా సంపుటిని వెలువరించారు. సామాజిక న్యాయాన్ని, శాస్త్రీయతను, హేతుబద్ధతను వీరి కథలు బోధిస్తాయి. 60. ముప్పాళ లక్ష్మణరావు వీరు కరీంనగర్ జిల్లా బీర్‌పూర్‌కు చెందిన వారు. వీరు రాసిన కథ ఎత్తుండ్రి పిడికిల్లు. ఈ కథ నేల తల్లి విముక్తికోసం కథా సంకలనంలో ప్రచురితమైంది. 61. ముదుగంటి పాపిరెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు అరుదుగా కథలు రాసినా, రాసిన కథలతో వీడని బంధాలు అనే కథా సంపుటిని వెలువరించారు. ఇతని పాత్రలు ఎక్కువగా ఆదర్శాలు, ఆశయాలతో కదులుతుంటాయి. సమాజంలోంచి, జీవితంలోంచి తీసుకొని రాసిన మంచి కథలు. 62. ముదిగంటి సుజాతా రెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత్రుల్లో అనేక కథలు రాసి, ప్రచురించిన కథకురాలు సుజాతా రెడ్డి. మింగుతున్న పట్నం, విసుర్రాయి లాంటి కథా సంపుటాలు వెలువరించారు. తెలంగాణా తొలితరం కథకులు-1, 2 సంపుటాలను పరిశోధించి వెలువరించారు. ఈమె కథలు ఆలోచనాత్మకాలు. తన కథల్లో సైతం వివిధ రకాలైన శిల్ప పద్ధతులను అనుసరిస్తారు. 63. మొగురం గట్టయ్య కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. రాక్షసులు, దారులు లాంటి కథలు రచించారు. వీరి కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. 64. మేర్గు రవీందర్ కరీంనగర్‌జిల్లా గోదావరిఖని కార్మికుడు. జీతం అనే వీరి కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు మరిన్ని మంచి కథలు రాశారు. 65. యశోదా రెడ్డి కరీంనగర్‌తో అనుబంధం కలిగిన వీరు వయస్సులోనూ, యశస్సులోనూ ఎదిగిన రచయిత్రి. ఈమె కథలకు ఇక్కడి భాష జవాన్ని, జీవాన్ని ఇచ్చింది. మా ఊరి ముచ్చట్లు కథా సంపుటిని వెలువరించారు. వీరి కథల్లో తెలంగాణా సామెతలు, పలుకుబళ్ళు, నుడికారం కనబడుతాయి. 66. రామ శంకర్ కరీంనగర్ జిల్లాకు చెందిన వీరి అంతర్మథనం అనే కథ నల్లకలువలు కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు అనేక కథలు రాశారు. 67. రామ భోజ కరీంనగర్‌కు చెందిన బి. రాములుగారు రామ భోజ అనే పేరుతో రచనలు చేశారు. ఎక్కడవేసిన గొంగళి…., చీడపురుగులు, సంస్కారి అనే కథలు వీరి సామాజిక స్పృహకు నిదర్శనలు. 68. రుద్రవరం ఎల్లయ్య కరీంనగర్ లోని హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన వీరు స్త్రీ సమస్యను, దళిత సమస్యను తన కథల్లో చిత్రించారు. పుట్టుకూడదు అనే కథ వీరి కథా కౌశలానికి నిదర్శనం. 69. రేగులపాటి కిషన్ రావు కరీంనగర్‌కు చెందిన వీరు ఈ తరం కథలు, స్వామీజీ కథలు అనే కథా సంపుటాలను వెలువరించారు. వ్యావహారిక భాషలో కథ చెప్పడం వీరి శైలి. ప్రేమలు, మూఢ నమ్మకాలు, సామాజిక అంతరాలు, మోసం, విఫల ప్రేమ లాంటివి వీరి కథలకు ఇతివృత్తాలు. 70. రేగులపాటి విజయలక్ష్మి కరీంనగర్‌కు చెందిన వీరు పట్టుదల, ప్రతీకారం లాంటి కథల ద్వారా కథారంగ ప్రవేశం చేశారు. 71. వనమాల చంద్రశేఖర్ కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. తక్కువ రాసినా మంచి కథలు రాశారు. వీరి కథలు సామాజిక సమస్యలకు ప్రతి బింబాలు. శిథిలాలు అనే కథ ప్రసిద్ధి చెందినది. వీరి శైలి పాఠకులకు ఆసక్తిని గొలుపుతుంది. 72. వాసాల నర్సయ్య కరీంనగర్ జిల్లాకు చెందిన వీరు, వివిధ విషయాలపై గల్పికలు రాశారు. దాదాపు తొంభైదాకా గల్పికలు రచించి సంపుటిని వెలువరించారు. వీరి శీర్షికలు ఆసక్తిగొలుపుతాయి. 73. వినోద్ కరీంనగర్‌కు చెందిన వీరి కథ పునాది, బద్‌లా కథా సంకలనంలో ప్రచురితమైంది. వీరు మంచి కథకులు. 74. వి.ఆర్. అవధాని కరీంనగర్ జిల్లా మంథనికి చెందిన వారు. గోలకొండ పత్రిక సంపాదక వర్గంలో వీరొకరు. పూర్తిపేరు వేంకట రాజన్న అవధాని. గేయాలు, కవిత్వం, కథలు రాశారు. తిరుగుబాటు అనే వీరి కథ స్త్రీ విద్య, స్త్రీ స్వేచ్ఛ గురించి చర్చించింది. 1930లో పతిపత్ని అనే నవల రాశారు. 75. వీరగోని పెంటయ్య కరీంనగర్ వాసి. కథాభిమాని. స్వయంగా కథకుడు. వీరి కథలు ఆహ్వానం, సృజన లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి. ఎవరి రక్షకులు, ఊర పిచ్చుకలు, పోరుపెట్టి…, సమ్మవ్వ తల్లి, రేపురా అనే కథలు వీరి ఆలోచనల్ని పట్టిస్తాయి. వీరి కథలు కొన్ని అలభ్యాలు. 76. వేల్పుల నారాయణ అనేక కథలు రాసిన వీరు కరీంనగర్ సింగరేణి కార్మికుల నుండి ఎదిగిన కథకుడు. అగ్గి అనే వీరి కథ నల్లకలువలు అనే కథా సంకలనంలో ప్రచురితమైంది. 77. వేముల సత్యనారాయణ కరీంనగర్ జిల్లాకు చెందిన వేముల సత్యనారాయణ వృత్తిరీత్యా లెక్చరర్. అరుదుగా కథలు రాసే వీరు చాలా తక్కువ కథలు రాశారు. వీరి కథలు వస్తు వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. అందుకు ఉదాహరణగా వీరి రికార్డ్ డాన్సర్ నిలుస్తుంది. అవే నోళ్ళు అనే కథ వీరి అభ్యుదయ దృక్పథాన్ని స్పష్టపరుస్తుంది. 78. శ్రీదాస్యం లక్ష్మయ్య కరీంనగర్ చెందిన వీరి కథల్లో తెలంగాణా ప్రాంతోచిత భాష జాలువారింది. హత్య, మంకు, తల్లిపానం, కలిసొచ్చిన కాలం, ముందొచ్చిన అల్లుడు, డబ్బల గాడి లాంటి కథలు సామాజిక సమస్యలను చిత్రించాయి. 79. సరిపెల్లి కృష్ణారెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కథకుడు సరిపెల్లి కృష్ణారెడ్డి. బిగిసిన పిడికిల్లు, మౌనపోరాటం, మెట్ట వేదాంతం లాంటి కథలు రాశారు. 80. సంకెపల్లి నాగేంద్ర శర్మ కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యుడు. యాది, రామభక్తి, పక్కింటావిడ, ఆత్మ కథ, వేసవి సెలవులు వద్దు బాబోయ్ మొదలగు కథలు రాశారు. దాదాపు అన్ని కథలు సర్వసాక్షి దృష్టికోణంలో రాశారు. జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నందున, కథల్లో కూడా జర్నలిస్టిక్ అప్రోచ్ కనబడుతుంది. 81. సబ్బని లక్ష్మీనారాయణ కరీంనగర్‌కు చెందిన వీరు అతి తక్కువగా కథలు రాశారు. కథలన్నీ ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. అనుభవ శకలాలు, నైజం అనేవి ప్రథమ ముద్రితాలు. బాధ్యత, పెళ్లి కూతురు, పొద్దు తిరుగుడు పూలు, కుడి ఎడమైతే కథలు కథన శక్తిని తెలిపేవిగా ఉన్నాయి. అతని అక్షరమ్మీద చెవి పెట్టి వినండి అనే కథ రాష్ట్రస్థాయి బహుమతిని అందించింది. కరువచ్చింది, బేరం లాంటి మరిన్ని కథలు వీరి కలం నుండి వెలువడ్డాయి....మరిన్నివివరాలు 82. డా. సి. నారాయణ రెడ్డి కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో జన్మించిన వీరు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. ప్రసిద్ధ కవి. విశ్వంభర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అనేక బిరుదులు, పదవులు అందుకున్న వీరు కథలు కూడా రాశారు. కలీం-మీర్జా అనే కథ సారస్వత జ్యోతి - డిసెంబర్ 1954 సంచికలో ప్రచురితమైంది. మరొక కథ అలభ్యం....... మరిన్నివివరాలు 83. వారాల ఆనంద్ కరీంనగర్ ఫిలంసొసైటీ ప్రెసిడెంట్ అయిన ఈయన సినిమా దర్శకుడు, చాలా కథలు, కవితలు, సినిమా రంగంపై వివిధ పుస్తకాలు రాశారు. లయ, మానేరు తీరం, నవ్య చిత్ర వైతాళికులు, బాల చిత్రాలు కొన్ని, ఫ్రీలాన్స్ జర్నలిస్టు మరియు వివిధ పత్రికలకు కాలమిస్టు, ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.......మరిన్నివివరాలు 84. కీ.శే. అలిశెట్టి ప్రభాకర్ ఆంధ్రజ్యోతిలో సిటీలైఫ్ కార్టూనిస్టుగా అందరికీ సుపరిచితం. వేశ్యపై వ్రాసిన కవిత ఆంద్రరాష్ట్రమంతా విమర్శకుల మన్ననలందుకుంది. సగటుమనిషి సిటీ జీవనవిధానంపై చాలా కవితలు రాసి అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందారు. 85. ముద్దసాని రాం రెడ్డి శ్రీ ముద్దసాని రాం రెడ్డి గారు తెలుగు సాహిత్యం పట్ల ఎంతో నిబద్ధత గల దీక్షాదక్షుడు, ప్రముఖ సాహితీవేత్త. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారాలు, తెలుగు అకాడెమీల బహుమతులు ఈయన సాహితీ ప్రతిభకు, సాహితీ ఆరాధనకు అందిన ఎన్నో బహుమతులలో కొన్ని. కారు ప్రమాదంలో ...........మరిన్నివివరాలు Source: http://soyi.discover-telangana.org/
From Mr. B.V.N. Swami Article "ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం" |
Sahityam 
